మైదుకూరు, జూలై 15: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాలు జి.రామమోహన్ అధ్యక్షతన ఉమ్మడి భవిష్యత్తు కోసం నైపుణ్యాలు అనే అంశం పై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీఎఫ్ఎస్ఐ, ఐటి&ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్స్ వృత్తి విద్య ట్రైనర్లు తేజ, జెర్రీ, గురు మోహన్, మధురిమలు సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం డ్రాయింగ్, క్విజ్, రోల్ ప్లే వంటి పలు పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కడప జీసీడీఓ దార్ల రూత్ ఆరోగ్య మేరీ విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి ప్రతిభను అభినందించారు. అనంతరం పోటీల విజేతలకు బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. నేటి యువతకు వృత్తి విద్య ఎంతో అవసరమని, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో నైపుణ్యాల పాత్ర కీలకమని వివరించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ ఎ.శ్రీనివాసుల, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, సీనియర్ ఉపాధ్యాయులు ఎ.రాముడు, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
