కేసీ కెనాల్ రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణం

మైదుకూరు: కేసీ కెనాల్ పరిధిలోని రైతులు ఈ ఖరీఫ్ లో వరి పంట వేసుకోవద్దని ప్రభుత్వం చెప్పడం దారుణమని రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ అన్నారు.  బుధవారం చాపాడులో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ అధ్యక్షుడు అన్నవరం వెంకటేశ్వర్లు, సమితి చాపాడు మండల నాయకులు రాయని రామకృష్ణ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేసీ కెనాల్ డివిజన్ స్థాయిలో అధికారులు రైత సమావేశాలు నిర్వహించి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకృతి వైఖరి, వర్షాభావ పరిస్థితులను వివరించాలని కోరారు. ఖరీఫ్ లో వరి పంట వేసుకోలేని పరిస్థితిలో ఇతర పంటల వేసుకునేలా రైతులను సమాయత్తం చేయాల్సి ఉందన్నారు. కానీ ప్రభుత్వం ఇవేమీ చేయకుండా.. కేవలం కేసీ కాలువకు సాగునీరు రాదని, వరిపంట వేసుకోవద్దని పత్రికలు, అధికారుల ద్వారా చెప్పించడం దారుణమన్నారు.  వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేసి కెనాల్ డివిజన్ స్థాయి రైతు సమావేశాలు నిర్వహించి రైతులకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వివరించాలని ఏవి రమణ డిమాండ్ చేశారు.