మైదుకూరు: స్థానిక శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 45 రోజుల ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 86వ బూత్ లో ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు, రాష్ట్ర కనీస వేతనాల డైరెక్టర్ దాసరి బాబు అధ్యక్షతన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడమే కాకుండా, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా దాసరి బాబు మాట్లాడుతూ.. శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ నాయకత్వంలో మైదుకూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, వార్డులోని ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ఈ 45 రోజుల కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జ్ తుపాకుల రమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ , దాసరి సత్యనారాయణ, భూమిరెడ్డి అంజి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.