రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలను కఠినతరం చేయాలి..!

  • జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప, జూలై 7: రోడ్డు భద్రత చర్యల నిబంధనలు, ఆంక్షలను కఠినతరం చేస్తూ.. జిల్లాలో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో.. జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ డా. శ్రీధర్ చెరుకూరి తోపాటు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హాజరయ్యారు. రవాణా, పోలీసు, జాతీయ రహదారుల సంస్థ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, వైద్య తదితర శాఖల అధికారులతో కలిసి రహదారి భద్రత, ప్రమాదాల నివారణ చర్యలు, జీరో ఫ్యాటాలిటీ జిల్లా కార్యక్రమం, జాతీయ రహదారులపై ఆక్రమణల తొలగింపు, పాఠశాలల పరిసరాల్లో భద్రతా చర్యలపై ఆయా శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2026 జనవరి నుంచి జూన్ వరకు జరిగిన రహదారి ప్రమాదాల గణాంకాలను సమావేశంలో పరిశీలించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మొత్తం ప్రమాదాల సంఖ్య స్వల్పంగా పెరిగినా, మరణాల సంఖ్య తగ్గినట్లు అధికారులు వివరించారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధిక ప్రమాదాలు నమోదవుతున్నాయని గుర్తించి, ఆ సమయంలో ప్రత్యేక గస్తీ, ట్రాఫిక్ నియంత్రణ, నిబంధనల అమలును మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, హిట్ అండ్ రన్ ఘటనలు, పాదచారుల భద్రత లోపించడం వంటి కారణాలతో అధిక మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు వివరించగా, ఈ అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు కఠిన అమలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే 92 కీలక ప్రాంతాలను గుర్తించినట్లు సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నళ్లు, జీబ్రా క్రాసింగ్‌లు, సోలార్ బ్లింకర్లు, రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్ తదితర రహదారి భద్రతా సదుపాయాలను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారులపై ఆక్రమణలను పూర్తిగా తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణాలు, వీధి వ్యాపారుల తరలింపు వంటి చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంపికైన ఆరు జీరో ఫ్యాటాలిటీ జిల్లాల్లో వైఎస్సార్ కడప జిల్లా ఒకటిగా ఉన్నందున, ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో తక్కువ వ్యయంతో ఎక్కువ ఫలితాలు ఇచ్చే భద్రతా చర్యలను వెంటనే అమలు చేయాలని, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పాఠశాలల పరిసరాల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, రోడ్డు భద్రతపై పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, మైనర్లు వాహనాలు నడపకుండా పర్యవేక్షించడం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యంతో రహదారి భద్రతా సంస్కృతిని పెంపొందించాలని సూచించారు. రహదారి ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని, గుడ్ సమారిటన్ పథకం, పీఎం రాహత్ నగదురహిత చికిత్స పథకం అమలును మరింత సమర్థవంతంగా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే హిట్ అండ్ రన్ కేసుల పరిష్కారం, పరిహారం చెల్లింపులు, పెండింగ్ కేసుల పురోగతిని వేగవంతం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అదేవిధంగా, పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసే ప్రక్రియను కొనసాగించాలని, పోలీసు-రవాణా శాఖలు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించి నిర్దేశించిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వీర్రాజు, కే ఎంసి అధనపు కమిషనర్ రాకేష్ చంద్రం, జెడ్పి సీఈవో, డిపివో సుబ్రహ్మణ్యం, ఆర్ అండ్ బి శాఖ ఎస్.ఈ. చంద్రశేఖర్, కమిటీ సభ్యులైన విద్యుత్ శాఖల ఎస్.ఈ.లు, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు, ట్రాఫిక్, పోలీసు, రవాణా శాఖ అధికారులు, రోడ్ సేఫ్టీ డి.ఎస్.పి, ఐరాడ్ జిల్లా కోఆర్డినేటర్, రోడ్డు భద్రత ఎన్.జి.ఓ.ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.