విద్యాహక్కు చట్ట సవరణకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టండి

  • జగన్మోహన్ రెడ్డికి ఫ్యాప్టో కడప జిల్లా శాఖ విజ్ఞప్తి

కడప: విద్యాహక్కు చట్టం లోనే 23వ సెక్షన్ సబ్ సెక్షన్ వన్ సవరించేలా పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని.. తద్వారా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు లభించేలా కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లా ఫ్యాప్టో విజ్ఞప్తి చేసింది. మంగళవారం పులివెందులలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కడప జిల్లా ఫ్యాప్టో చైర్మన్ సంగమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ను కలిసిన బృందం విద్యాహక్కు చట్ట సవరణకు సంబంధించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం పై చర్చించింది.  విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినా.. అంతకు ముందు ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన వారిని కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చట్టాన్ని ప్రోస్పెక్టివ్ గా 2010 నుంచి అమలు చేసేలా చట్ట సవరణకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా వారు వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులకు ఒకవైపు బోధన బాధ్యతలు ఉండగా మరోవైపు టెట్ కు ప్రిపరేషన్ కష్టసాధ్యంగా మారిందన్నారు. పైగా బోధించే సంబంధిత సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టుల్లో కూడా పరీక్ష రాయాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని, దీనికి పరిష్కారం చూపే దిశగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ జనరల్ అబ్దుల్లా, శ్యాంసుందర్ రెడ్డి, దాదా పీర్, రామాంజనేయులు, శ్రీనివాసరెడ్డి, నిహారిక, విక్టర్, శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.