తల్లికి వందనం నిధుల కోసం.. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి..!

  • సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎం. చింతామణి

కడప: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం. చింతామణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 1,849 మంది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాల అనుసంధానం ఇంకా పూర్తికాలేదని ఆమె వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు వెంటనే సమీప తపాలా కార్యాలయంలో భారత తపాలా చెల్లింపుల బ్యాంకు ఖాతాను తెరవడం లేదా ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసి జాతీయ చెల్లింపుల వ్యవస్థలో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఖాతా ప్రారంభానికి పదో తరగతి మార్కులిస్ట్, లేదా జనన ధ్రువీకరణ పత్రం వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలని తెలిపారు. ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న విద్యార్థులు కూడా తమ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవడం తప్పనిసరని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తేనే ‘తల్లికి వందనం’ పథకం నిధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. అందువల్ల జిల్లాలోని అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఆలస్యం చేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.