పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ఆదేశాలు
- మైదుకూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, మౌలిక వసతుల కొరతపై స్పందించిన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి కళాశాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. తనిఖీ సందర్భంగా కళాశాల భవనాల దయనీయ పరిస్థితి, తరగతి గదులు, ప్రయోగశాలలు, ప్రాథమిక సౌకర్యాల కొరతను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన మౌలిక వసతులు, భవనాల మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర అన్ని సౌకర్యాలను తక్షణమే కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను అత్యవసర ప్రాతిపదికన మంజూరు చేయడంతో పాటు, నూతన కళాశాల భవనం నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కూడా త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, ఆధునిక విద్యా వాతావరణాన్ని కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మైదుకూరు నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ విద్యాసంస్థను దశలవారీగా బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
