అక్రెడిటేషన్ ఉంటేనే జర్నలిస్టా..?

  •  అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులు చాలా మంది.. వేల మంది.. ఇంకా ఉన్నారు కాబట్టి.. మరో విధంగా అడుగుతాను.. అక్రెడిటేషన్ ఉన్నవాళ్ళందరూ జర్నలిస్టులేనా?

భారత రాజ్యాంగం ప్రతి పౌరునికీ స్వేచ్ఛగా మాట్లాడగలిగే.. రాయగలిగే హక్కు ఇచ్చింది. జర్నలిస్టులకు కూడా ఈ హక్కుకి మించి అదనంగా ఎలాంటి రక్షణ లేదు. ఎలాంటి ప్రత్యేక హక్కులు, రక్షణ లేనప్పటికీ.. సమాజ శ్రేయస్సు కోసం.. జర్నలిస్టులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నిష్పాక్షికత అందులో ప్రధానమైనది. తమ సంస్థల్లో చాలాకాలం పనిచేసినవారిని కూడా కాస్ట్ కటింగ్ పేరుతో చాలా మేనేజిమెంట్లు ఇంటికి పంపేశాక.. రాయటం మాత్రమే తెలిసిన చాలామంది జర్నలిస్టులకు యూట్యూబ్ ఒక వరంలా మారింది. అలాంటి వారు సొంత చానెళ్ళను యూట్యూబ్ వేదికగా ఏర్పాటు చేసుకుని తమ గళాన్ని వినిపిస్తున్నారు. కొద్దోగొప్పో పేరున్నవారికి తప్ప.. యూట్యూబ్ చానెల్ కేవలం జర్నలిజం మాత్రమే చేసే వారికి శ్రమకు తగ్గ ఆదాయాన్ని ఇవ్వటం లేదు. బతకాలి కాబట్టి, కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఇలాంటి చాలా మంది జర్నలిస్టులు ఇష్టం ఉన్నాలేకున్నా తప్పనిసరై రాజకీయనాయకుల అవసరాలను, ఆదేశాలను అనుసరించి పనిచేస్తున్నారు. ప్రతిదీ వ్యాపారాత్మకం అయి.. లాభమే ప్రధానాంశం అయిన పరిస్థితుల్లో వీరిని తప్పుపట్టగల వారెవరు?

ఇక వార్తాసేకరణ, వాక్యనిర్మాణం, జర్నలిజం పట్ల కనీస అవగాహన లేని, అర్హత లేని చాలా మంది యూట్యూబ్ వేదికగా.. తమకు తోచింది రాస్తూ.. తమ మనసుకి నచ్చింది మాట్లాడుతూ.. వీడియోలు చేస్తున్నారు. వీరెవరినీ జర్నలిస్టులు కాదని అనగలమా? వీరు కూడా జర్నలిస్టులే అయితే.. నిజంగా జర్నలిజం చేస్తున్నవారంతా ఎవరు? చెప్పలేం. ఏమాత్రం బాధ్యతలేని కొందరు వ్యక్తులు.. తమ ఆదాయం కోసం.. సంచలనాలను ఆసరా చేసుకుని.. యూట్యూబ్ చానెళ్ళు నడపడం.. ఇతర సోష్జల్ మీడియా వేదికలను వాడుకోవటం… చట్టం దృష్టిలో తప్పు కాకపోవచ్చు. అది వారి హక్కు కూడా కావచ్చు. కానీ వీళ్ళందరూ జర్నలిస్టులేనా? అయినా.. జర్నలిస్టులందరూ బాధ్యతకలిగి ప్రవర్తిస్తున్నారా?

ప్రభుత్వం అక్రెడిటేషన్ ఇవ్వటానికి.. ఒక అర్హతను నిర్ణయిస్తుంది. ఆ అర్హత ఆయా సంస్థలకు ఉంటేనే.. వాటిలో పనిచేసే జర్నలిస్టులకు అక్రెడిటేషన్ వస్తుంది. ఎంత పెద్ద సీనియారిటీ ఉన్నా.. జర్నలిజం విద్యార్థులకు క్లాసులు చెప్పగలిగే అనుభవం, విద్యార్హతలు ఉన్నా.. ఆ అర్హత ప్రమాణాలు సాధించలేని.. సంస్థల్లోని జర్నలిస్టులకు అక్రెడిటేషన్ రాదు. తమ సంస్థకు అక్రెడిటేషన్ తెచ్చుకోగల అర్హత లేనంత మాత్రాన.. ఆ జర్నలిస్టులు.. నిజంగా జర్నలిస్టులు కాకుండా పోరు. ఎప్పుడూ జర్నలిజం వృత్తిలో లేనప్పటికీ.. మీడియాలో ఉన్నంతమాత్రాన.. చాలా మంది అక్రెడిటేషన్ పొందటం మనం చూస్తున్నాం. ఆయా సంస్థల మేనేజిమెంట్ నిర్ణయాలు, యూనియన్ల సిఫార్సులు వల్ల..అక్రెడిటేషన్ కమిటీల్లోని సభ్యులు బలవంతంగా కళ్ళకు గంతలు కట్టుకుని ఆయా అక్రెడిటేషన్‌లు మంజూరు చేస్తున్నారు.

మార్కెటింగ్, ఎడ్వర్టైజ్‌మెంట్ వంటి నాన్-జర్నలిస్టిక్ విభాగాల్లో పనిచేసే వారికి అక్రెడిటేషన్ ఇప్పించుకున్న సంస్థలు ప్రతిజిల్లాలో ఉన్నాయి. అసలు అర్హత లేకపోయినా.. పాత డాక్యుమెంట్లను, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చిన సర్టిఫికెట్లను చూపించి అక్రెడిటేషన్లు తీసుకుంటున్న సంస్థలు కూడా ఉన్నాయి. అధికారులతో పరిచయాలు ఉపయోగించుకుని అప్లికేషన్లను అప్రూవ్ చేయించుకున్నవి కూడా ఉన్నాయి. వందల అప్లికేషన్లను ఆమూలాగ్రం పరిశీలించి, ప్రతి సర్టిఫికెట్‌ను వెరిఫై చేసి నిర్ణయం తీసుకోవటం అధికారులకు సాధ్యంకాదు కాబట్టి.. వారిని తప్పుబట్టలేం. అన్నీ పరిశీలించాం, అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి.. అని అధికారులు చెప్పాక.. అక్రెడిటేషన్ కమిటీల్లోని వారు చేయగలిగేది ఏమీ ఉండదు.

కాబట్టి.. సమస్యకు నాకు తోచిన పరిష్కారం..

ఎప్పుడో ఒకప్పుడు.. ఎక్కడో ఒకచోట.. జర్నలిజంలోని అనర్హుల వడపోత జరగాలి. జర్నలిస్టులకు కచ్చితమైన అర్హతలు నిర్ణయించబడాలి. మూడేళ్ళకో, అయిదేళ్ళకో.. వారి పనితీరు మదింపు జరగాలి. అక్రెడిటేషన్ అనేది.. సంస్థ ఆధారంగా కాకుండా.. జర్నలిస్టు అనుభవం, అర్హతల ఆధారంగా ఉండాలి. ఇలా జరగాలంటే.. ఆయా సంస్థలు గౌరవప్రదమైన వేతనాలు జర్నలిస్టులకు ఇచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటే.. మీడియా సంస్థల యాజమాన్యాలకు భయపడని వ్యక్తులు ప్రభుత్వాధినేతలు కావాలి.

ఇదంతా ఎప్పటికి జరగాలి?