రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి నాంది..!!

* జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్రాజెక్టు పనులకు శ్రీకారం
* రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభం
* రూ.16,350 కోట్ల పెట్టుబడి తో రెండు దశల్లో 20 లక్షల టన్నుల సామర్థ్యంతో నిర్మాణం కానున్న ఉక్కు కర్మాగారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థ.. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె వద్ద.. రాయలసీమ సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను నాంది పలికింది. శుక్రవారం గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జమ్మల మడుగు మండలం సున్నపు రాళ్ళ పల్లె వద్ద ఈ బృహత్తరమైన అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు,పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ,జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ జయంత్ ఆచార్య,జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీమతి ఎస్.సవిత,రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టి పాటి రవికుమార్,రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. యువరాజ్,జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,రాష్ట్ర ప్రభుత్వ విప్,జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.

రెండు దశల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి
జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పూర్తిగా అనుబంధ సంస్థగా ఈ ప్రాజెక్టు అమలవుతోంది. మొత్తం 20 లక్షల టన్నుల (2 MTPA) వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారాన్ని రెండు దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో సంవత్సరానికి 10 లక్షల టన్నుల సామర్థ్యమున్న సమీకృత ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తారు. రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో సామర్థ్యాన్ని 20 లక్షల టన్నులకు పెంచనున్నారు. దీంతో మొత్తం పెట్టుబడి వ్యయం రూ.16,350 కోట్లకు చేరనుంది. 

* అత్యాధునిక సాంకేతికతతో పర్యావరణహిత ఉత్పత్తి..
ఈ ప్రాజెక్టులో అత్యాధునిక ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ (EAF) సాంకేతికతను వినియోగించనున్నారు. పునర్వినియోగ ఉక్కు స్క్రాప్, డైరెక్ట్ రిడ్యూస్డ్ ఐరన్ (DRI)ను ముడి పదార్థాలుగా ఉపయోగించి తక్కువ కార్బన్ ఉద్గారాలతో అత్యుత్తమ నిర్మాణ ఉక్కును తయారు చేయనున్నారు. పునరుత్పాదక విద్యుత్ వినియోగం, ఇంధన పొదుపు సాంకేతికతలు, వనరుల సమర్థ వినియోగం ద్వారా దేశంలోనే అత్యంత సుస్థిర ఉక్కు తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఈ కర్మాగారాన్ని తీర్చిదిద్దనున్నారు.

* రాయలసీమకు పారిశ్రామికంగా భారీ ఊతం..
ఈ ప్రాజెక్టు ద్వారా రహదారి, రైల్వే, విద్యుత్, నీటి వసతులు మరింత అభివృద్ధి చెందనున్నాయి. అనుబంధ పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది బలమైన పునాదిగా మారనుంది.

* రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పై జేఎస్‌డబ్ల్యూ ప్రశంసలు..
రాయలసీమ స్టీల్ ప్రాజెక్టు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక భవిష్యత్తుపై జేఎస్‌డబ్ల్యూ నమ్మకానికి నిదర్శనమని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని కొనియాడారు. ప్రపంచ స్థాయి పారిశ్రామిక సామర్థ్యాల నిర్మాణంలో భాగస్వాములు కావడం తమకు గర్వకారణమని తెలిపారు.

* దేశ ఉక్కు రంగానికి కొత్త బలం.. 
తయారీ, మౌలిక సదుపాయాల విస్తరణలో భారతదేశం కీలక దశలో ఉందని, ఆంధ్రప్రదేశ్ ఈ అభివృద్ధికి కేంద్రబిందువుగా మారుతోందని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు దేశీయ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రాయలసీమ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

* జేఎస్‌డబ్ల్యూ లక్ష్యం – సుస్థిర అభివృద్ధి..
2030 నాటికి ఉక్కు తయారీ కేంద్రాల్లో కార్బన్ ఉద్గారాలను 42 శాతం తగ్గించడం, 2050 నాటికి నికర కార్బన్ తటస్థత సాధించడం జేఎస్‌డబ్ల్యూ లక్ష్యంగా పెట్టుకుంది. జీవవైవిధ్య పరిరక్షణ, నీటి వినియోగ నియంత్రణ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వంటి పర్యావరణ ప్రమాణాలను ఈ ప్రాజెక్టులో అమలు చేయనుంది.

* రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో మరో మైలురాయి.. 
రాయలసీమ స్టీల్ ప్రాజెక్టు ప్రారంభం కేవలం ఒక కర్మాగార నిర్మాణానికి మాత్రమే కాకుండా, రాయలసీమను జాతీయ పారిశ్రామిక పటంలో మరింత బలంగా నిలబెట్టే కీలక అడుగుగా నిలవనుంది.భారీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, పర్యావరణహిత ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు, అనుబంధ పరిశ్రమల అభివృద్ధితో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పురోగతిలో ఒక మైలురాయిగా నిలుస్తుందనడంలో.. ఈ శంకుస్థాపన ఘట్టం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.

ఈ కార్యక్రమంలో డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్,జేసీ డా. నిధీమీనా, సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన, కమలాపురం,మైదుకూరు ఎమ్మెల్యేలు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్,నాయకులు పి వి ఎన్ మాధవ్,భూపేష్ రెడ్డి సంబందిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.